సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  • సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
  • అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమంటూ కోర్టుకు తెలిపిన నటి జాక్వెలిన్
  • ముందుగా ఈడీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఢిల్లీ కోర్టు
  • గతంలో జాక్వెలిన్‌పై కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ
  • రూ.7 కోట్లకు పైగా బహుమతులు స్వీకరించారని జాక్వెలిన్‌పై ఈడీ ఆరోపణలు
ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించింది.

నిబంధనల ప్రకారం జాక్వెలిన్ అప్రూవర్‌గా మారాలనుకుంటే మొదట దర్యాప్తు సంస్థ అయిన ఈడీకి అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, దానిని పరిశీలించిన తర్వాతే ఆమెను అప్రూవర్‌గా మార్చాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు కోర్టులో ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ దాఖలు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే జాక్వెలిన్ అప్రూవర్‌గా మారే అవకాశం ఉంటుంది.

గతేడాది సెప్టెంబర్‌లో తనపై నమోదైన మనీలాండరింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమె అప్రూవర్‌గా మారేందుకు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుకేశ్ నేర చరిత్ర గురించి తనకు తెలియదని, తానూ అతని చేతిలో మోసపోయానని జాక్వెలిన్ మొదటి నుంచి వాదిస్తున్నారు. సుకేశ్ తనను తాను ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని తప్పుదోవ పట్టించాడని ఆమె కోర్టులో పేర్కొన్నారు.

అయితే, ఈడీ మాత్రం జాక్వెలిన్‌ను ఈ కేసులో సహ నిందితురాలిగా పేర్కొంటూ 2022 ఆగస్టులోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుకేశ్ ఒక నేరస్థుడని తెలిసి కూడా అతని నుంచి రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలు, కార్లు, ఖరీదైన వస్తువులను బహుమతులుగా స్వీకరించారని ఈడీ ఆరోపిస్తోంది. సుకేశ్ అరెస్ట్ అయిన తర్వాత జాక్వెలిన్ తన ఫోన్‌లోని డేటాను తొలగించారని, మొదట్లో ఆర్థిక లావాదేవీల వివరాలను దాచిపెట్టి, ఆధారాలు చూపించాక అంగీకరించారని దర్యాప్తు సంస్థ తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొంది.

ప్రస్తుతం పలు కేసుల్లో సుకేశ్ చంద్రశేఖర్ జైలులో ఉన్నాడు. అతను జాక్వెలిన్‌ను తన ప్రేయసిగా చెప్పుకుంటూ జైలు నుంచి ప్రత్యేక సందర్భాల్లో లేఖలు రాయడం తెలిసిందే. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చినప్పటికీ, జాక్వెలిన్ మాత్రం తాను మోసపోయినట్లు చెబుతున్నారు. తాజా పరిణామంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.



Jacqueline Fernandez
Sukesh Chandrasekhar
money laundering case
Enforcement Directorate
Delhi court
Bollywood actress
crime news
ED investigation
approver
financial fraud

More Telugu News